భారతభూమి కర్మభూమి. అందుకే భారతదేశం ఆధ్యాత్మిక చింతనకు నిలయమైంది. విశ్వశ్రేయస్సుని ఆకాంక్షిస్తూ తమ ప్రవచన సుధామాధురీ ఝరులతో ప్రజల్ని పవిత్రులను చేస్తూ తమ రచనలతో పరమాత్మతత్త్వాన్ని ప్రబోధించి ప్రజలకు ధార్మిక నైతిక నిష్ఠలతో హృదయ సంస్కారాలతో మానవ జీవన గమనాన్ని నిర్దేశించే వాఙ్మయాన్ని సృష్టించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వారంరికీ నా వందనాలు.
భారతీయ ఆధ్యాత్మికత ఒక జీవనదీ ప్రవాహం. అది నిత్యం సాగిపోతూ ఉంటుంది. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలనే త్రివిధమార్గాలద్వారా ఆధ్యాత్మిక పరమావధిని చేరుకొనే విధివిధానాలను మానవ జీవన విధానంతో మేళవించి సంప్రదాయాలరూపంలో అనుసంధానం చేశారు. అదే భారతీయులకు తరగని అమూల్యమైన వారసత్వసంపద.
ఈ నేపథ్యంలో భారతదేశమంతటా భక్తిమార్గం విశేషంగా వ్యాప్తిని పొందింది. ఒక ఉద్యమమై ఉవ్వెత్తున ఎగసింది. ఈ భక్తిమార్గవ్యాప్తికోసం ఎందరో మహర్షులు, కావ్యకర్తలు, భక్తాగ్రేసరులు, సంగీతజ్ఞులైన వాగ్గేయకారులు ఎంతగానో కృషి చేశారు. అలా కృషిచేసినవారిలో ఉత్తరభారతదేశంలో తులసీదాస్, కబీర్ దాస్, మీరాబాయి, సూర్ దాస్, లీలాశుకయోగి ప్రముఖులు. దక్షిణభారతదేశంలో వేదవాఙ్మయం తర్వాత ఆధ్యాత్మిక వాఙ్మయం అవతరించింది. మొట్టమొదట తమిళభాషలోనే, అందులోనూ ఆళ్వారుల దివ్యప్రబంధాలలోని జ్ఞాన, భక్తి, వైరాగ్యసంపన్నులైన ఆళ్వారులు లోకానికి చేసిన ఉపకారం వర్ణనాతీతం.
దక్షిణభారతదేశంలో దాదాపు 5,6 శతాబ్దాలలో సమాజాన్ని చైతన్యవంతం చేసిన తేజఃపురుషులు, భక్తి నిర్వచనాన్ని, గమనాన్ని, గమ్యాన్ని మార్చిన వేదాంతకోవిదులు ఆళ్వారులు. విశ్వమానవ కళ్యాణంకోసం, సర్వజనసమానత్వంకోసం, సర్వజన సౌఖ్యశాంతులకోసం మానవాళి ఆచరించాల్సిన ఆదర్శసూత్రాలను ముందుగా వాళ్ళు ఆచరించి చూపిన సాత్త్వికోదయ సంపన్నులు ఆళ్వారులు.
Author